జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో వారికి ఎర వేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున జనాల డబ్బు కాజేస్తున్నారు. ఇక కరోనా సమయంలో ఆ వైరస్ భయాన్ని అదునుగా చేసుకుని కొందరు సైబర్ నేరస్థులు అనేక రకాల మెయిల్స్, మెసేజ్‌లు పంపుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. దీంతో వారి ఉచ్చులో పడి సహజంగానే అనేక మంది పెద్ద ఎత్తున డబ్బును నష్టపోతున్నారు. అయితే అలాంటి సంఘటనల్లో డబ్బు కోల్పోయినా.. ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవచ్చు.
సైబర్ దాడుల్లో డబ్బులు నష్టపోతామని భావించే వారు ఎవరైనా సరే.. సైబర్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవచ్చు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. రూ.75 లక్షల క్లెయిమ్‌కు రూ.9వేల వరకు ప్రీమియం చెల్లిస్తే చాలు.. ఎలాంటి సైబర్ దాడిలో అయినా సరే.. డబ్బులు నష్టపోతే క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆ క్లెయిమ్‌కు అయ్యే ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయి. పలు ప్రత్యేకమైన సందర్భాల్లో ఇతర ఖర్చులను కూడా భరించేలా ఇన్సూరెన్స్ కంపెనీలు సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి.
ఇక వ్యాపారవేత్తలు తమ సంస్థ కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో ఎక్కువగా నిర్వహిస్తుంటే.. వారు కూడా సైబర్ థెఫ్ట్, సెక్యూరిటీ ఇన్సూరెన్స్‌ను తీసుకోవచ్చు. సంస్థలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, సంస్థ ఏ పనిచేస్తుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేస్తారు, పని విలువ ఎంత, కంపెనీ టర్నోవర్, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఏ మేర ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.. అనే విషయాల ఆధారంగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్‌ను కూడా పలు కంపెనీలు అందిస్తున్నాయి. కనుక.. సైబర్ దాడిలో నష్టపోయినా.. ఇన్సూరెన్స్ ద్వారా ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే.. వెంటనే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి మరి..!