మేడ్చల్‌లో దారుణం..నడిరోడ్డుపై మహిళ ప్రసవం!

-

పేదల కోసం అనేక వైద్య పథకాలు అందుబాటులో ఉన్నా, వారికి సకాలంలో వైద్యం అందక వారి ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలాంటి విషాధ ఘటనే నగరానికి అతి చేరువలో ఉన్న మేడ్చల్‌లో చోటుచేసుకుంది. జవహార్‌ నగర్‌కు చెందిన 8 నెలల గర్భవతి లక్ష్మి అనే మహిళ కాలికి గాయం కావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కానీ, హోలీ పండగ కావడంతో స్టాఫ్‌ ఎవరూ లేరని పెయిన్‌ కిల్లర్స్‌ మందులు ఇచ్చి ఇంటికి పంపారు. అయితే బయటకు వచ్చిన ఆమె అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. దీంతో ఆమె రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది.

తాను ప్రసవ వేదనను అనుభవిస్తూ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు కూడా అక్కడ లేరు. దీంతో ఆ పసి ప్రాణం కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచింది. అదికూడా జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం గమనార్హం.

మేడ్చల్‌కు చెందిన లక్ష్మి 8 నెలల గర్భిణి. కొద్ది రోజులుగా ఆమె కాలి గాయంతో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమవారం ఉదయం జవహర్‌నగర్‌ హెల్త్‌ సెంటర్‌కు చేరుకుంది.ఆస్పత్రి ఆవరణలో ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండటాన్ని ఫార్మసిస్ట్‌ గమనించి హోలీ సందర్భంగా సెలవు కావడంతో డ్రెసింగ్‌ చేయడం కుదరదని, మంగళవారం ఉదయం రమ్మని, లక్ష్మీకి పెయన్‌ కిల్లర్‌ మందులు ఇచ్చి పంపారు.

మందులు తీసుకుని లక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోయింది. అయితే నీరసంతో ఆమె ఆస్పత్రికి దగ్గర్లోనే రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయింది. తీవ్ర ప్రసవ వేదనతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అయితే అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం లక్ష్మీని గాంధీ ఎమర్జెన్సీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version