లెజెండ్రీ కమెడియన్ గా రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రాజబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ , కృష్ణ , శోభన్ బాబు, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలలో ఎక్కువగా కమెడియన్ గా పనిచేసే ఒక్కోసారి హీరోలతో సమానంగా పారితోషకం కూడా తీసుకున్నారు.. ఇక ఈయన గురించి తెలుసుకోవాలి అంటే.. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు , రమణమ్మ దంపతులకు 1937 అక్టోబర్ 20వ తేదీన జన్మించారు. ఈయన అసలు పేరు అప్పలరాజు. రాజమండ్రిలో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక టీచర్ ట్రైనింగ్ చేసి బడిపంతులుగా కొంతకాలం పనిచేశారు. అదే కాలంలో నాలుగిల్ల చావిడి, అల్లూరి సీతారామరాజు, కుక్కపిల్ల దొరికింది లాంటి నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ సినీ నటుడు కావాలనే తపనతో ఉద్యోగానికి రాజీనామా చేసి 1960లో మద్రాస్ చేరుకున్నారు.
ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. మరొకవైపు బ్రతకడానికి ట్యూషన్లు చెప్పేవారు. ఇక అడ్డాల నారాయణరావు నిర్మించిన 1960లో వచ్చిన “సమాజం” అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా నటుడిగా వెండితెరపై కాలు పెట్టారు. తర్వాత తనదైన శైలిలో కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ తిరుగులేని కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రమ ప్రభ గారితో ఎక్కువగా ఈయన కామెడీ పండించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఏ సినిమాలో అయినా సరే వీరిద్దరు జంటగా ఉన్నారంటే తప్పకుండా వారిపై ఒక హాస్య గీతం ఉండాల్సిందే.. అంతేకాదు అనేక చిత్రాలకు ఈ జంట ఆసెట్ అయ్యింది అనేది కాదనలేని నిజం.
ఇక సినిమాలో రాజబాబు లేరని తెలిస్తే డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారి డిమాండ్ కారణంగా కథకు సంబంధం లేకపోయినా సరే సపరేటు ట్రాక్ తీసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకవైపు కమెడియన్ గా చేస్తూనే మరొకవైపు హీరోగా కూడా నటించారు. ఇక దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ” తాతా-మనవడు” సినిమాలో ఎస్వీ రంగారావు తాతగా నటిస్తే.. ఆయన మనవడిగా రాజబాబు నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే రాజబాబు అకాల మరణం పొందడానికి కారణం ఆయనకున్న తాగుడు వ్యసనమే.. అలా 1983 ఫిబ్రవరి 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.