అమరావతి లోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కీలక చట్ట సవరణ కు ఆమోదం తెలిపారు. అమరావతి సిఆర్డిఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేయగా, అసెంబ్లీ చేసిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. దీంతో అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకి లైన్ క్లియర్ అయింది.
సిఆర్డిఏ, ఏపి మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం సవరణలకు ఆమోదం తెలియజేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర అర్హులందరికీ ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. దీనికి సంబంధించిన పాలకవర్గం పాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సిఆర్డిఏ చట్ట సవరణ చేశారు.