ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఉద్యోగ సంఘాలు పరస్పర విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెక్రటేరియట్ జేఏసీ వెంకట్రామిరెడ్డి మీద రెవెన్యూ జేఏసీ విమర్శలు గుప్పించింది. వెంకట రామిరెడ్డి వ్యాఖ్యలతో ఉద్యోగులు చులకన అయ్యారని అమరావతి జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి తీరు అభ్యంతరకరమని ఆయన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని బొప్పరాజు పేర్కొన్నారు. అసలు బయట సంఘాలతో వెంకట్రామిరెడ్డికి ఏం పని అని బొప్పరాజు ప్రశ్నించారు.
మా సంఘం ప్రతిపాదనలను పక్కనపెట్టి అలా ఆయన ఒత్తిడి తెస్తున్నాడని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.. ఇప్పటికే వెంకట రామిరెడ్డి గురించి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పామని ఆయన అన్నారు. అయితే దీని మీద వెంకట రామ రెడ్డి స్పందిస్తూ కోర్టు తీర్పు ఎలక్షన్ కమిషన్ కి అనుకూలంగా వచ్చాక కొందరు మాట మార్చారు అని, ఇతర సంఘాల మీద నింద మోపి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సచివాలయ గోడలమీద క్యాలెండర్ లు అంటించి వద్దని చెబితే దాన్నిబొప్పరాజు అపార్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి మరి.