మత్స్యకారుల మధ్య గొడవ.. సముద్రం మధ్యలో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత !

విశాఖలో మరో సారి మత్స్యకారుల మధ్య గొడవ జరిగింది. వలల వివాదంలో మత్స్య కారులు పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. పెద్ద జాలరి పేట వద్ద రింగు వలలు, సంప్రదాయ వలలు వాడే మత్స్యకారుల మధ్య ఘర్షణ మొదలైనట్లు చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిజానికి ఈ రెండు వర్గాల మధ్య ఈ మధ్య గొడవ జరిగితే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు ఆ వివాదాన్ని పరిష్కరించారు.

అయితే మరి కొద్ది రోజులకే ఈ రెండు వర్గాల వారు దాడులు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. భీమిలి, అన్నవరం బ్రిడ్జ్ రోడ్ సమీపంలో ఒక మత్స్యకారుల వర్గం 10 కిలో మీటర్ల దాటి లోపలికి వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో మరో వర్గం వీరి మీద గొడవకు దిగినట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యలో పడవల మీద నుంచి పరస్పరం మత్స్యకారులకు దాడులు దిగినట్లుగా సమాచారం అందుతోంది. సముద్రం మధ్యలో దాడులకు దిగడంతో ఎవరికైనా గాయాలయ్యాయా ఏమిటా అనే విషయం మీద కూడా ఇంకా సరైన క్లారిటీ అందడం లేదు. ఘటనకు సంబంధించి వివరాలు అందాల్సి ఉంది.