కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయిందని, త్వరలో జరగునున్న బీహార్ అసెంబ్లీ ఎ న్నికల తర్వాత ఏ క్షణమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రాంవిలాస్ పాస్వాన్ శాఖలను వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌కు అప్పగించడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ మరుసటి రోజే ప్రధాని మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడ్తారని భావిస్తున్నారు.
అంతేగాక పలువురు కీలక మంత్రులకు కూడా స్థాన చలనం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.
తాజా మార్పుల్లో బీజేపీ ఎంపీలకే ఎక్కువ అవకాశాలుంటాయని, బీహార్ ఫలితాలను బట్టి జేడీయూ నేతలకూ స్థానం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధాని చేపట్టే భారీ మార్పుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థాన చలనం తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. నిర్మల సమర్థవంతంగానే పని చేస్తున్నప్పటికీ వ్యాపార, పారిశ్రామిక, ఆర్థిక వర్గాల్లోనూ, మధ్య తరగతి, సామాన్య వర్గాల్లోనూ విశ్వాసాన్నిపొందలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయా రంగాల్లో వి శ్వాసం కలిగించగల, జనాదరణ సంపాదించగల ఆర్థిక మంత్రిగా ఎవర్ని నియమించాలన్న అంశంపై మోడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కొత్తగా మంత్రివర్గంలో చేరే వారిలో జ్యోతిరాదిత్య సింధియా, సురేశ్ ప్రభు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.