ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్లో కేసులు
విజయవాడ: దసరా ఉత్సవాలు తరువాత కూడా విజయవాడు కనకదుర్గగుడిలో వివాదాలు కొనసాగుతున్నాయి. పాలకమండలి వర్సెస్ ఈవో గా సాగిన వివాదాలు రూటు మారి ఈవో వర్సెస్ ఏఈవో కు మధ్య చినికి చినికి గాలివానగా మారాయి. దసరా ఉత్సవాల సమయంలో జరిగిన సన్మానాలకు సంబంధించిన మెమెంటోల కొనుగోలులో ఏఈవో అచ్యుతరామయ్య చేతివాటం ప్రదర్శించారని ఈవో కోటేశ్వరమ్మ ఏఈవోతోపాటు మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అచ్యుతరామయ్య తనపై నోరు చేసుకున్నారని, దుర్భాషలాడారని వన్‌టౌన్ పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో సోమవారం ట్విస్ట్ నెలకొంది. ఈవో కోటేశ్వరమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఈవో అచ్యుతరామయ్య అన్నారు. మెమొంటోల కొనుగోళ్లలో అక్రమాలు జరగలేదన్నారు. కావాలనే ఈవో కోటేశ్వరమ్మ ఉద్యోగులను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ఉమ ప్రోటోకాల్ వివాదంలో కూడా.. తనను బలిపశువును చేసేందుకు ప్రయత్నించారని, అవసరమైతే దేవాదాయ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని అచ్యుతరామయ్య స్పష్టం చేశారు. కాగా ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అచ్యుతరామయ్యను విచారించారు.