హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. జీవిక కెమికల్ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని అంబరీష్, అన్వర్ అనే కార్మికులు మరణించారు.
మరో నలుగురికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. భారీ శబ్దంతో బాయిలర్ పేలడంతో చుట్టుపక్కల దట్టంగా రసాయనిక పొగలు అలుముకున్నాయి. అలాగే పేలుడు ధాటికి షెడ్డు శకలాలు అర కిలోమీటరు దూరం వరకు ఎగిరిపడడంతో స్థానికులు భీతిల్లారు రంగలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, మృతులు బీహార్ కు చెందినవారిగా గుర్తించారు.