సికింద్రాబాద్‌లోని దక్కెన్ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ఇవాళ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, ఫైర్ సెఫ్టీ, రెవెన్యూ, ఇతర అధికారుల జరగాల్సిన ఈ సమావేశం ఎల్లుండికి వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో వాణిజ్య భవణాలు, అనుమతులు, ఫైర్ అనుమతులు ఇతర అంశాలపై చర్చించేందుకు భేటీ అవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మరోవైపు అక్రమ నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25వేల వరకు ఉండొచ్చని వెల్లడించారు. అయితే, అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.