ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకున్న మత్స్యకారుల ఘర్షణ.. తదనంతర పరిణామాలు.. ముఖ్యమం త్రి జగన్‌కు ఏం చెబుతున్నాయి ? ఈ పరిణామాలు.. రాజకీయంగా నేర్పుతున్న పాఠాలు ఏంటి ? అని ఆలోచిస్తే.. చాలా కీలకమైన విషయాలే కనిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించిం ది. అయితే.. మిగిలిన చోట్ల పార్టీ పరాజయం పాలైంది. కానీ, అలా ఓడిన చోటల్లా.. కూడా పార్టీ బలంగా లేక కాదు.. నేతలు బలంగా లేకపోవడమూ కాదు. కానీ, కీలకమైన స్థానాల్లోనూ వైసీపీ పరాజయం పాలైంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీ నేతలను వైసీపీకి అనుకూలంగా మార్చుకున్నారు సీఎం జగన్.
అదేవిధంగా చీరాల.. ఇక్కడ నుంచి ఆ మంచి ఓడిపోయారు. అయినప్పటికీ.. గడిచిన పదేళ్లుగా ఆయన వరుస విజయాలు సాధించడంతో పాటు.. వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకున్నారు. 2014లో ఓ వైపు రాష్ట్ర విభజనతో టీడీపీ స్వింగ్, ఇటు ప్రకాశం లాంటి జిల్లాలో వైసీపీ జోరును అడ్డుకుని మరీ ఆమంచి ఇండిపెండెంట్‌గా గెలవడం.. అది కూడా 10 వేల మెజార్టీతో అంటే మామూలు విషయం కాదు. గత ఎన్నికల్లో మాత్రం సమీకరణలు మారాయి. చివర్లో ఆమంచి పార్టీ మారడం ఆయనకు మైనస్ అయ్యింది. అప్పటి వరకు టీడీపీలో ఉండి చివర్లో వైసీపీలోకి వచ్చి పోటీ చేయడంతో పాటు కొన్ని సమీకరణలు ఆయన ఓటమికి కారణమయ్యాయి.
అయితే చీరాలలో కరణం గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పాటు టీడీపీలో ఉంటే తన కుమారుడు వెంకటేష్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన కరణం కుమారుడికి వైసీపీ కండువా కప్పించేసి తాను పరోక్షంగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుగా మారారు. ఇలాంటి పరిణామంతో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయాలు పెరిగిపోయాయి. కరణం పార్టీకి ప్లస్ అవ్వాల్సింది పోయి చీరాలలో పార్టీని పక్కనే ఉన్న సముద్రంలో బొంద పెడుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఈ జంపింగ్‌లు పార్టీకి ప్లస్ అవుతారనుకుంటే మైనస్‌గా మారిపోయారు. అసలు వీళ్లతో పార్టీకి ఒరిగిందేమిటన్నది సొంత పార్టీ నేతల నుంచే వస్తోన్న ప్రశ్న.
గతంలో చంద్రబాబు కూడా ఇలానే చేసుకున్నారు. వైసీపీ నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను తనపార్టీలో చేర్చుకున్నారు. అయితే.. వీరిలో గత ఏడాది ఎన్నికల్లో గెలిచింది కేవలం ఒకే ఒక్కరు అది కూడా అద్దంకి నుంచే! మరి ఇప్పుడు వైసీపీ చేస్తోంది ఏంటి? పార్టీ మారిన వారిని అధిష్టానం ఎంకరేజ్ చేస్తుండడంతో గ్రూపుల గోల పెరిగి అంతిమంగా టీడీపీ పాలనలో ఏం జరిగిందో అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు వీళ్లంతా పార్టీ ప్రయోజనాల కోసం రావడం లేదు.. వారి స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ గెలిచాక వస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలకు ఈ జంపింగులు ఎసరు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా.. ఈ జంపింగులను ప్రోత్సహించడం మానుకోవాలని వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కోరుతుండడం గమనార్హం.