రాష్ట్రంలో బీజేపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న స్టేట్ బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయ సాధనకు కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావించింది.
ఈ క్రమంలోనే స్టేట్ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చించి జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సిద్ధమయ్యారు. శనివారం నామినేషన్ల స్వీకరణ, ఆదివారం జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జనవరి నెలాఖరులోపు పూర్తి చేయా్సి ఉండగా..ఆలస్యమైంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సైతం ఎన్నికోవాల్సి ఉంది.దానికి ముందు పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగాల్సి ఉంది. జిల్లాల అధ్యక్షుల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం కావడంతో వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.