ఏటీఎంలు వచ్చాక మనకు మరింత సౌకర్యం ఏర్పడింది. మాటి మాటికీ బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకునే కష్టం తప్పింది. అయితే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి కానీ వాటిల్లో డబ్బులను విత్ డ్రా చేసే సమయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా కోసం ప్రయత్నిస్తే అది కొన్ని సందర్భాల్లో రాదు. కానీ అకౌంట్‌లో నగదు డెబిట్ అయినట్లు చూపిస్తుంది.
కానీ ఇందుకు కంగారు పడాల్సిన పనిలేదు. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే నగదు మన అకౌంట్‌లో 24 నుంచి 48 గంటల్లో ఆటోమేటిగ్గా జమ అవుతుంది. అయినప్పటికీ నగదు జమ కాకపోతే మీ బ్యాంక్ బ్రాంచిని సంప్రదించి ఫిర్యాదు చేయండి. దీంతో వారు మీ సమస్యను పరిష్కరిస్తారు. వారికి మీరు చేసిన ట్రాన్సాక్షన్ కు చెందిన వివరాలను తెలియజేయండి. తేదీ, సమయం, ఏటీఎం సెంటర్ ఉన్న ప్రదేశం, ట్రాన్సాక్షన్ నంబర్ వివరాలను ఇవ్వండి. దీంతో బ్యాంకు వారు మీ ఫిర్యాదుకు స్పందించి వెంటనే నగదును మీ అకౌంట్‌లో జమ అయ్యేలా చేస్తారు.
అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి కానీ వాటిని తీసుకోవడాన్ని కొందరు మరిచిపోతారు. కొన్ని సమయాల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్ పూర్తిగా ముగియకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో అలాంటి సమయాల్లో ఏటీఎం నుంచి డబ్బులు వచ్చినా వారు వాటిని తీసుకోలేరు. అయితే అలా ఏటీఎం నుంచి వచ్చే డబ్బులను మనం తీసుకోకపోయినా బ్యాంకులు ఆ ట్రాన్సాక్షన్‌ను వాలిడ్‌గా గుర్తిస్తాయి. అంటే అందుకు బ్యాంకులు బాధ్యత వహించవు. మనమే బాధ్యత వహించాలి.
కొత్త ఏటీఎంలలో మనం నగదును తీసుకునేంత వరకు కార్డులు బయటకు రావు. కనుక ఇబ్బంది ఉండదు. అదే పాత ఏటీఎంలు అయితే మనం నగదును తీసుకోవడం మరిచిపోతే ఆ నగదు తిరిగి ఏటీఎం లోపలికి వెళ్లదు. కనుక అలాంటి సందర్భాల్లో మనమే బాధ్యత వహించాలి. ఆ నగదును తీసుకోకపోతే ఆ తరువాత వచ్చే ఎవరైనా దాన్ని తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో నగదును మళ్లీ వారి నుంచి రికవరీ చేసుకోవడం కష్టం అవుతుంది. బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చు. కనుక ఏటీఎంలలో నగదును తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేసి, కార్డును తీసుకున్నాకే అక్కడి నుంచి వెళ్లాలి. తెర మీద ట్రాన్సాక్షన్ పూర్తయినట్లు మెసేజ్ వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలి. లేదంటే మనం అక్కడి నుంచి వెళ్లిపోయాక డబ్బులు బయటకు వస్తే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.