నాడు జ‌గ‌న్‌కు హ్యాండ్‌… నేడు బాబు ద‌గ్గ‌ర ఆట‌లో అర‌టి పండు…!

-

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు రాజ‌కీయాల్లో మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌కి కీల‌క రోల్ ఉంది. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అమ‌ర్‌నాథ్‌కు ఇక్క‌డ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. 2014లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పారు. అయితే, త‌ర్వాత కాలంలో ఆయ‌న మంత్రి ప‌ద‌విపై మోజుతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు త‌లొగ్గారు. ఈ క్ర‌మంలోనే వైసీపీని వ‌దిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా రెండేళ్లు వ్య‌వ‌హ‌రించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. రాజకీయాల్లో జంపింగులు స‌హ‌జం.


వైసీపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, నాయ‌కులు పార్టీ మారారు. అయితే, మిగిలిన వారికి అమ‌ర్‌నాథ్‌కు తేడా ఉంది. జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన అమ‌ర్‌నాథ్‌.. పార్టీ మార‌డం వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత ఆయ‌న చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయ‌డం, జ‌గ‌న్పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో స్థానికంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి దూర‌మ‌య్యారు. పార్టీ మార‌డాన్ని రెడ్డి వ‌ర్గం పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల విష‌యంలో మాత్రం సీరియ‌స్ అయింది.

దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. 2014లో కేవ‌లం 2 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించిన అమ‌ర్‌నాథ్‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 32 వేల మెజారిటీ తేడాతో చిత్తుగా ఓట‌మిని చ‌విచూశారు. దీనికి ప్ర‌ధానంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఆయ‌న దూరం కావ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు. పైగా  ఈ పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో అమ‌ర్‌నాథ్ రాజ‌కీయాలు కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారాయి. టీడీపీ త‌ర‌ఫున కొన్నాళ్లు మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించారు.

అయితే, పార్టీ శ్రేణులు పెద్ద‌గా ఆయ‌న‌తో క‌లిసి రాలేదు. పైగా వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట్ గౌడ దూసుకుపోతున్నారు. యుత‌ను స‌మీక‌రిస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పుడు రెడ్డి వ‌ర్గం అంతా కూడా ఈయ‌న వెంటే ఉన్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సైతం అమ‌ర్‌నాథ్‌కు చెక్ పెట్టేలా వెంక‌ట్ గౌడ‌ను బాగా ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో అమ‌ర్‌నాథ్ రాజ‌కీయాల్లో ఆట‌లో అరిటి పండు మాదిరిగా మారారు.

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version