ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లాగా స్పీకర్ మా అనర్హత పిటిషన్ పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో పోయిందన్నారు.
శివసేనను వీడిన ఏక్ నాథ్ షిండే గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర స్పీకర్ ని ఆదేశించిందని గుర్తుచేశారు. స్పీకర్ కి కోర్టులు కాలపరిమితి విధిస్తున్నందున అనర్హత పిటిషన్ పై ఇక వాయిదాలు కుదరవు అన్నారు. నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచే ఆయన శాసన సభా సభ్యత్వం రద్దయినట్టే లెక్క అని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు.