వైసీపీకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు. లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని..ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశానని తెలిపారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధ పడుతూనే ఉంటానని అన్నారు. మళ్లీ చంద్రబాబు నాయత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని భ్రమించి అందులో చేరానన్నారు. కాని ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. సంక్షేమం, సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చరిత్రాత్మక విజయం కట్టబెట్టారన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆశా భావం వ్యక్తం చేశారు. ఓ పక్క సమాజసేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేయాలని వైసీపీకు రాజీనామా చేసినట్లు కిశోర్‌బాబు తెలిపారు.