సహజంగా రాజకీయ నేతలు భయపడరు. వారు ఎలాంటి సమస్యలనైనా ఎదిరిస్తారనే పేరుంటుంది. సవాళ్లు ప్రతిసవాళ్లు సహజం. ఎక్కడా భయపడిపోవడం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడపడం వంటివి ఉండవు. అదే సమయంలో వారాంతంవచ్చిందంటే.. పార్టీలకు అతీతంగా నాయకులు విందులు చేసుకుంటారు. అర్ధరాత్రి వరకు పార్టీలతో కాలం గడుపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు వారంతాళ్లో హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లి ఫ్యామిలీలతో గడపడమో లేదా పార్టీల్లో మునిగి తేలుతుండడమో చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన టీడీపీ నాయకులు.. సీనియర్లు… జూనియర్లు.. అనే తేడా లేకుండా వారాంతం వస్తోందంటే.. చాలు గుండెలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అది కూడా విశాఖపట్నంలోనే కావడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ టీడీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని.. ఇక్కడ అక్రమ నిర్మాణాలు సాగించారని భావిస్తున్న వైసీపీ సర్కారు పెద్దలు ఆయా అక్రమాలపై గురిపెట్టి కొడుతున్నారు. ఎక్కడికక్కడ ఆపరేషన్ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. అయితే, ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇలా కూల్చి వేతలు జరుగుతున్న అంశంపై ఎక్కడా ముందస్తు సమాచారం ఉండకపోవడం. పైగా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సమయం ఎంచుకుని మరీ.. రంగంలోకి దిగిపోతుండడంతో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాయకులు గుండెల్లో దడదడతో చిక్కబట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. శుక్రవారం రాత్రి గడిచిన శనివారం తెల్లవారు జాము స్టార్టవుతోందని అనగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. ఇలా మొదలైన ఈ కూల్చివేతల పర్వం.. వరుసగా.. శుక్రవారాలే సాగుతుండడం గమనార్హం. తర్వాత వరుసలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలు కూడా కూల్చేశారు. గీతం సీఈవో కూడా టీడీపీ నాయకుడు కావడం ఇక్కడ గమనార్హం. ఆ తర్వాత .. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉన్న ప్రత్యూష కంపెనీ ఆక్రమణలు అంటూ కూల్చేశారు. ఇది కూడా శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే జరిగింది.
ఇక, తాజాగా గంటా అనుచరుడు.. బొడ్డేటి కాశీవిశ్వనాథానికి చెందిన మంగమూరి పేటలోని రిక్రియేషన్ క్లబ్‌ను కూల్చివేయడం మరింత సంచలనంగా మారింది. రోజుకు పది లక్షల రూపాయల వ్యాపారం సాగే.. ఈ క్లబ్ కూల్చివేతపై నాయకులు ఘొల్లు మంటున్నారు. దీంతో శుక్రవారం వస్తోందంటేనే నాయకులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఏం జరుగుతుందో.. అంటూ. కాలం గడపడం గమనార్హం.