ఏపీలోని కృష్ణా జిల్లాలో కనిపించకుండాపోయిన నలుగురు అమ్మాయిల ఆచూకీ లభ్యమైంది. వారిని గుంటూరులో కనిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాదుకు చెందిన నలుగురు అమ్మాయిలు బెజవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు.
రెండ్రోజుల కిందట వీరంతా కాలేజీకి బంక్ కొట్టి షాపింగుకు వెళ్లారు. విషయం తెలియడంతో కాలేజీ యాజమాన్యం,తల్లిదండ్రులు వారిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అమ్మాయిలు గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో అమ్మాయిల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన అమ్మాయిలను పిడుగురాళ్ల సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.