ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా జామాయిల్ కర్రలు తొలగించేందుకు వచ్చిన కూలీలు. పనులు ముగించుకుని గుడారాల్లో సేదతీరుతున్న సమయంలో పిడుగు వీరిని కబళించింది.
గుడారాలపై పిడుగు పడటంతో.. అందులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా… వీరిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మరణించినవారి మృతదేహాలను శవపరీక్ష కోసం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పొట్టకూటి కోసం పనికి వెళ్తే ప్రకృతి కన్నెర్ర చేసి తమ వాళ్లను తీసుకెళ్లిపోయిందని మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. చనిపోయిన వారంతా కుటుంబాన్ని పోషించే వారని.. వాళ్ల మరణంతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకుని తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.