ఫ్లవర్ వాజుల్లో పూలు ఫ్రష్ గా ఉండాలంటే ఇలా చేసేయండి..!

-

ఇండోర్ డెకరేషన్ లో అక్కడక్కడా ఫ్లవర్ వాజ్ లు పెట్టడం ఈమధ్య అందరూ చేసే పనే.. అవి ఇంట్లోవారికి, ఇంటికి వచ్చిన వారికి మంచి ఫీల్ గుడ్ మూడ్ ను అందిస్తాయి. అయితే ఫ్లవర్ వాజ్ లో ఫ్లవర్స్ పెట్టడంతోనే సరిపోదు. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే అందంగా ఉంటాయి. లేదంటే..ఆ ఫ్లవర్ వాజ్ అందవికారంగా తయారై.. ఎందుకురా ఇవి ఇక్కడ పెట్టారనేట్లు తయారవుతాయి. ఈరోజు మనం ఫ్లవర్ వాజుల్లో ఉండే పూలు తాజాగా ఉండాలంటే ఏం చేయొచ్చో చూద్దాం.

ఇంటి అలంకరణకు ఎక్కువగా రోజా పూలు, లిల్లీ పూలు.. వంటివి ఉపయోగిస్తారు.. అవి కొని ఇంటికి తీసుకొచ్చాక చూస్తే కొన్ని వాడిపోతూ ఉంటాయి. మరికొన్ని అప్పటికే పాడవుతాయి. అందుకే ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే పూలు ఎక్కువ కాలం తాజాగా ఉంటూ పరిమళాలు వెదజల్లాలంటే వాటిని కొనే సమయం నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే అవి మనం కోరుకున్నట్లు ఎక్కువ సమయం ఫ్రష్ గా ఉంటాయి.

మీరు రోజాపూలు కొనడానికి వెళ్లినప్పుడు పూల రెక్కలన్నీ కలిసి కాడ పైన ఉబ్బెత్తుగా ఏర్పడే నిర్మాణాన్ని తీక్షణంగా పరిశీలించండి. దాన్ని నొక్కినప్పుడు అది మరీ మెత్తగా అనిపిస్తే ఆ పూలు పాతవని అర్థం. అలాకాకుండా కాస్త మెత్తగా, కాస్త గట్టిగా అనిపిస్తే అవి తాజా పూలని అర్థం.

అలాగే ఎక్కువ రకాల పువ్వులు తీసుకున్నప్పుడు వేటికవి విడివిడిగా ప్యాక్ చేయించుకోవాలి. అలా చేస్తే ఇంటికి చేరుకున్న తర్వాత వాటిని సులువుగా విడదీసుకోవచ్చు. పువ్వులు కూడా నలిగిపోకుండా ఉంటాయి.

ఫ్లవర్ వాజుల్లో నీళ్లలో ఉంచే పువ్వులకు కాండం ఎంతవరకు నీటిలో మునుగుతుందో చూసుకుని దాని కింద ఉండే ఆకులు తీసేయాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు శుభ్రంగా ఉంటాయి.

మీరు తీసుకువచ్చిన పువ్వుల కాండాలు కూడా చెక్ చేసుకోవాలి. అవి విరిగినా లేక చివర్లు కాల్చినట్టు ఉన్నా.. ఎండిపోయినట్టు ఉన్నా.. వాటిని కట్ చేయాలి. కత్తిరించిన తర్వాత వాటిని ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేంత వరకూ నీటిలో ఉంచండి.

ఫ్లవర్‌వాజ్‌లు శుభ్రంగా ఉంటేనే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. అందుకే సబ్బు, వేడినీళ్లను ఉపయోగించి ఫ్లవర్‌వాజ్‌లను ఎప్పటికప్పుడు కడగాలి.

పువ్వుకు అవసరమయ్యే పోషకాలు నీటి ద్వారానే అందుతాయి కాబట్టి వాటికి ఇవ్వాల్సిన పోషకాలను నీటిలో కలిపి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీటిని మార్చాలి.

వాడిపోతున్న రెక్కల్ని తీసేయాలి. ఫ్లవర్‌వాజ్‌లో ఉండే నీళ్లు ఏ మాత్రం జిగురుగా అనిపించినా వెంటనే మార్చేయడం మర్చిపోకండే..

నేరుగా ఎండ పడే చోట, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చోట పువ్వులు ఉంచకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version