నేటి నుంచి జీ20 దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ఇవాళ, రేపు దిల్లీలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బీర్‌బాక్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్‌తో పాటు పలు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు.
ఇవాళ విదేశీ అతిథులకు స్వాగతం పలికే కార్యక్రమం ఏర్పాటు చేయగా.. రేపు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలో ఆహారం, ఇంధన భద్రత, తీవ్రవాదం, మానవతా సహాయం, విపత్తుల సహాయం తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌లను భారత్ అతిథులుగా ఆహ్వానించింది.