హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు, కాలువలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. అంతే కాకుండా భారీగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లను జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లల్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సహాయం చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాలు, నాళాల పక్కన నివసించే వారిని వసతి గృహాలకు తరలిస్తున్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు ఉండగా ప్రస్తుతం 1787.15కు నీటిమట్టం పెరగడంతో బుధవారం జలమండలి అధికారులు, స్థానిక ఎమ్మెల్యేప్రకాష్‌గౌడ్ చేతుల మీదుగా రెండు గేట్లను ఎత్తివేశారు. వికారాబాద్, శంకర్‌పల్లి, జన్వాడ గ్రామాల మీదుగా నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో జలాశయం నిండేందుకు మూడు అడుగులు ఉండగానే ముందస్తు చర్యలలో భాగంగా రెండు గేట్లను ఎత్తి 216 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు డీజీయం నరహరి తెలిపారు.