చాలా మంది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు.. కానీ కొందరికి మాత్రం అసలు గణేష్ చతుర్ధి అంటే తెలియదు. ఆ రోజున పండుగను ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు.
ప్రతి ఏటా వినాయక చవితి వస్తుందంటే చాలు… వాడవాడలా సందడి మొదలవుతుంది. గణేష్ ఉత్సవ కమిటీలు, యూత్ అసోసియేషన్లు, కాలనీ సంక్షేమ సంఘాలు నవరాత్రి ఉత్సవాల కోసం మండపాలను సిద్ధం చేస్తుంటాయి. అలాగే ఈ సారి ఎన్ని అడుగుల గణేష్ విగ్రహాన్ని పెడదామా.. అని కూడా అందరూ ఆలోచిస్తుంటారు. అయితే చాలా మంది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు.. కానీ కొందరికి మాత్రం అసలు గణేష్ చతుర్ధి అంటే తెలియదు. ఆ రోజున పండుగను ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
గణేష్ చతుర్ధి అంటే.. వినాయకుడి పుట్టినరోజు. ఆయన పుట్టిన రోజునే వినాయకచవితి అని, గణేష్ చతుర్ధి అని అంటారు. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధి చెందే 4 వ రోజున) నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. అదే రోజున నవరాత్రులు ప్రారంభమవుతాయి. తరువాత 10 రోజుల పాటు పండుగ ఉంటుంది. అనంతరం అనంత చతుర్దశి (చందమామ వృద్ధి చెందే 14వ రోజున) నాడు పండుగ ముగుస్తుంది. సాధారణంగా వినాయక చవితి పండుగ ప్రతి ఏటా ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 15వ తేదీల మధ్య వస్తుంటుంది.
అయితే చాలా మంది వినాయక చవితి ఒక్క రోజే ఉంటుందని అనుకుంటారు. కానీ అలా కాదు. పండుగ 10 రోజుల పాటు ఉంటుంది. కానీ ఆ రోజుల్లో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కేవలం చవితి రోజు మాత్రమే కాకుండా మిగిలిన 10 రోజుల్లో ఎప్పుడైనా సరే వినాయకుడికి భక్తులు పూజలు చేయవచ్చు. ఈ క్రమంలోనే ఆ రోజుల్లో పూజలు చేస్తే వినాయకుడి అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు..!