దసరా సమీపించినా ఉద్యోగుల వేతనాలు రాలేదు : గంటా

-

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి పండుగల సమయంలో ఉద్యోగులు వారం రోజుల ముందే వేతనాలు అందుకునేవారని, కానీ ఇప్పుడు దసరా పండుగ సమీపించినా వేతనాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి జగనన్నా పండగొస్తోంది.. మా జీతాలు ఇవ్వన్నా… కరుణించన్నా అనే విధంగా ఉందన్నారు గంటా శ్రీనివాస రావు. అమ్మో ఒకటో తారీఖు అనేది పాత మాట అని, ఇప్పుడు ఆ తేదీని కూడా ఉద్యోగులు మర్చిపోయారన్నారు గంటా శ్రీనివాస రావు.

జగన్ అధికారంలోకి వచ్చాక వేతనాలు ఒకటో తేదీన పడిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయన్నారు. గతంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీ ఉదయాన్నే వేతనాలు పడినట్లు మెసేజ్ వచ్చేదన్నారు. జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయిందన్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియదని, అంతా అయోమయం జగన్మాయగా మారిందన్నారు. నెల నెలా ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2019లో రాష్ట్రానికి జరగకూడని నష్టం జరిగిందన్నారు. ఇక్కడి ఉద్యోగుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యావంతులకు విజన్‌కు ఉన్న విలువ, విధ్వంసం తెచ్చే వినాశనం ఏమిటో అర్థమై ఉంటుందన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిక్సూచి కావాల్సింది విద్యావంతులే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version