గాసిప్ గురూ ! : టీడీపీ గూటికి సుచరిత ? షర్మిల గూటికి బాలినేని !  

-

మాజీ హోం మంత్రి, అసంతృప్త నాయ‌కురాలు మేక‌తోటి సుచ‌రిత త్వ‌ర‌లో టీడీపీ గూటికి చేర‌నున్నారా అంటే ఔననే కొన్ని సంకేతాలు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ ఊహాగానాలే కావొచ్చు. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె తీవ్ర మ‌న‌స్తాపం చెంది ఉన్నారు. ఉంచాల‌నుకుంటే అంద‌రినీ ఉంచాలి. లేదంటే అంద‌రినీ మార్చాలి. త‌న‌తో పాటు ప‌నిచేసిన ద‌ళిత సామాజిక‌వర్గ మంత్రుల‌ను కొన‌సాగించి త‌న‌నెందుకు త‌ప్పించార‌ని, తానేం పాపం చేశాన‌ని ప్ర‌శ్నిస్తున్నారామె. త‌న‌కు ప‌ద‌వుల‌పై వ్యామోహం కానీ అత్యాశ కానీ లేనే లేవ‌ని సోష‌ల్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేస్తున్నారు. స్పీక‌ర్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన ఆమె ఇక‌పై త‌న నిర్ణ‌యాన్ని పునః స‌మీక్ష చేసుకుంటారా లేదా అన్న‌ది సందేహాస్ప‌దంగానే ఉంది.

ఎందుకంటే తాను మొద‌టి నుంచి విధేయురాలిగానే ఉన్నాన‌ని, త‌న శాఖ విష‌య‌మై కూడా ముఖ్య‌మంత్రి ఏం చెబితే అదే చేశాన‌ని, ఆ విధంగానే న‌డుచుకున్నాన‌ని, కొంద‌రి అతి జోక్యం కార‌ణంగా ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింద‌ని అందుకే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేశాన‌ని ఇదివ‌ర‌కే ఆమె స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌స్తుతానికి పార్టీలో కొన‌సాగినా భ‌విష్య‌త్ లో ఆమె పార్టీ మార‌రు అని గ్యారంటీ ఏమీ లేదు. ముఖ్యంగా క్యాబినెట్ మార్పులు అన్న‌వి ఏ సూత్రం ప్ర‌కారం ఏ స‌హ‌జ న్యాయ సూత్రాల‌కు అనుగుణంగా ఏ సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా చేశారో త‌న‌కు చెప్పాల‌ని ప‌ట్టుబడుతున్నార‌ని సమాచారం. జ‌గ‌న్ కూడా ఆమెతో మాట్లాడేందుకు పెద్ద‌గా సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. ఎందుక‌నో ఆమె విష‌య‌మై అధిష్టానం అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఆ రోజు ఆమె ఎవ్వ‌రో ఎవ్వ‌రికీ తెలియ‌ద‌ని త‌మ అధినేత పుణ్య‌మాని రాష్ట్ర రాజ‌కీయాల్లో పేరుతో పాటు హోదాతో పాటు మంచి స్థాయి ద‌క్కించుకున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె టీడీపీ గూటికి చేరే అవ‌కాశాలు అన్న‌వి కేవ‌లం ఊహాగానాలే కావొచ్చు. నిజం అయితే వైసీపీ అధిష్టానం రియాక్ష‌న్ కూడా ఏ విధంగా ఉంటుందో అన్న‌ది అత్యంత ఆస‌క్తిదాయ‌కం. కేవ‌లం మేరుగ నాగార్జున కు ప‌ద‌వి ఇచ్చేందుకే ఆమెను త‌ప్పించార‌న్న వాద‌న కూడా ఉంది.

ఇదే స‌మయంలో మ‌రో అసంతృప్త నేత బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి (జ‌గ‌న్ బంధువు) ష‌ర్మిల‌తో ట‌చ్ లో ఉన్నార‌ని టాక్. త్వ‌ర‌లోనే ష‌ర్మిల ఆంధ్రా రాజ‌కీయాల్లో అడుగు పెడుతున్న దృష్ట్యా వైసీపీ అసంతృప్త వాదులంతా ఆమె గూటికి చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని ఓ ప్రాథ‌మిక స‌మాచారం. అదే క‌నుక జ‌రిగితే బాలినేనితో స‌హా చాలా మంది వైసీపీని వీడి త‌మ స‌త్తా చాటేందుకు ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీలో చేర‌డం ఖాయం. ప్ర‌స్తుతానికి ఇదంతా ఊహా సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల్లో భాగంగా ఉన్నా ఒక‌వేళ ఇవ‌న్నీ నిజం అయితే వైసీపీకి క‌ష్టాలు త‌ప్ప‌వు ముందున్న కాలంలో ! ఎందుకంటే ష‌ర్మిల కూడా ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు.

ముఖ్యంగా ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల పై కూడా ఆ మ‌ధ్య ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. విజ‌యమ్మ కూడా జ‌గ‌న్ వెంట లేరు. ఆమె కూడా ష‌ర్మిల‌నే ప్రోత్సహిస్తున్నారు. ఈ త‌రుణంలో వైసీపీలో చీలిక‌లు వ‌స్తే జ‌గ‌న్ కు ముందున్న కాలంలో అధికారం ద‌క్క‌డం మాట అటుంచితే పార్టీపై ప‌ట్టు నిలుపుకోవడ‌మే క‌ష్ట‌త‌రం అవుతుంది అన్నది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట. మ‌రోవైపు విప‌క్ష పార్టీలు కొన్ని ఇదే అదునుగా తీసుకుని ష‌ర్మిల‌ను ఇటుగా రావాల‌ని ప్రోత్స‌హిస్తున్నాయ‌ని కూడా తెలుస్తోంది. ఒక‌వేళ అటువంటి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అయితే బాలినేని లాంటి సీనియ‌ర్లే కాదు సామినేని ఉద‌య‌భాను లాంటి లీడ‌ర్లు కూడా ష‌ర్మిల గూటికి చేరే అవ‌కాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version