టైటిల్: జార్జ్‌రెడ్డి
జానర్: బయోపిక్
నటీనటులు: సందీప్ మాధవ్, సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, ముస్కాన్, మహాతి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: అప్పిరెడ్డి
దర్శకత్వం: జీవన్ రెడ్డి
రిలీజ్ డేట్: 22 నవంబర్, 2019
ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే చరిత్రలో అందరూ మర్చిపోయిన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 25 ఏళ్లకే స్టూడెంట్ లీడర్‌గా ఎన్నో సంచలనాలకు నెలవు అయిన జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా జార్జ్‌రెడ్డి సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే ట్రైలర్లు, మెగా ఫ్యామిలీ మద్దతు, ఏబీవీపీ ఆందోళనలతో పాటు నైజాంలో కాస్త ప్రి రిలీజ్ బజ్ ఉండడంతో జార్జ్రెడ్డిపై ఆసక్తి నెలకొంది. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో ఈ తరం జనరేషన్‌కు జార్జ్‌రెడ్డి గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువుగా ఉంది. ఈ అంచనాల నేపథ్యంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ? రివ్యూలో చూద్దాం.
కథ :
జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండేవాడు. అటు విజ్ఞానంతో పాటు ఇటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో కూడా అతడికి మంచి టాలెంట్ ఉంటుంది. తల్లి (దేవిక) తోడ్పాటు ఉంటుంది. ఎప్పుడైతే యూనివర్సిటీలో అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతడి లైఫ్ మారిపోతుంది. అతడి టాలెంట్‌కు ఎంతో మంది మేథావులు సైతం షాక్ అవ్వడంతో పాటు అతడిని తమ యూనివర్సిటీకి రావాలని ఆహ్వానాలు పంపినా అతడు మాత్రం తిరస్కరిస్తాడు.
ఈ క్రమంలోనే యూనివర్సిటీపై పట్టు బిగించే క్రమంలో ఏబీసీడీ గ్రూప్ (సత్య), కౌశిక్ (కృష్ణ చైతన్య), అర్జున్ (మనోజ్ నందన్) లాంటి వాళ్లు యూనివర్సిటీలో గ్రూపు రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతుంటాయి. ముందు సైలెంట్‌గా ఉన్నా తర్వాత జార్జ్‌రెడ్డి వీళ్లను ఎదిరించడం స్టార్ట్ చేస్తాడు. చేగువేరా ప్రభావంతో పోరాట పటిమ కనపరిచి చివరకు స్టూడెంట్ లీడర్‌గా మారతాడు. ఇలా యూనివర్సిటీ ఎలక్షన్స్‌లో జార్జ్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు. రోజు రోజుకు అతడు పాపులర్ అవ్వడంతో అతడిని చంపితే తప్ప మనకు చోటు ఉండదని ప్రత్యర్థులు స్కెచ్ వేస్తారు ? అప్పుడు జార్జ్‌రెడ్డి ఏం చేస్తాడు ? అతడు ఎవరిని ప్రేమించాడు ? అతడి ప్రేమ ఏమైంది ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఇది బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ కమర్షియల్ హీరో తెరమీద చేసే విన్యాసాలే జార్జ్‌రెడ్డి చేసినట్టు చూపించారు. సినిమా నెరేషన్ డాక్యుమెంటరీ స్టైల్లో ఉండడంతో ఇది డాక్యుమెంటరీలా మారింది. ఇది టోటల్‌గా జార్జ్‌రెడ్డి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం కన్నా అతడి జీవితంలో జరిగిన కొన్ని విషయాల సమూహారంగా ఉన్నట్టు ఉంటుంది. జార్జ్‌రెడ్డి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని అనుకోవడం మంచి ఆలోచనే అయినా దానిని ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా సినిమాతో ట్రావెల్ అయ్యేలా ప్రజెంట్ చేసి ఉండాల్సింది. జార్జ్‌రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు.. ఘట్టాలు ఉన్నాయి. వాటిని ప్రేక్షకుడు అదే అనుభూతికి గురయ్యేలా మాత్రం దర్శకుడు సన్నివేశాలు డిజైన్ చేసుకోలేకపోయాడు.
ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల పరిచయం… జార్జ్‌రెడ్డి ఎలివేషన్, రెండు మూడు చోట్ల హీరో సూపర్బ్ ఎలివేషన్‌తో తొలి అర్థభాగం ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో దర్శకుడు బాగానే ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు. సెకండాఫ్‌కు వచ్చేసరికి కమర్షియల్ చట్రంలో ఇరికించడంతో కథ కాస్త డీవియేట్ అయ్యింది. కొన్ని చోట్ల సీన్లు అతికించినట్టు ఉంది. ఇలాంటి సినిమాలకు మాటలు ముఖ్యం. అవి చాలా చోట్ల తేలిపోయాయి. హీరోయిన్ వన్‌సైడ్ లవ్ ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ మేజర్ హైలెట్.
నటీనటుల విషయానికి వస్తే వంగవీటితో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్ మాధవ్ ఈ సినిమాలోనూ మెప్పించాడు. చాలా చోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. జార్జ్‌రెడ్డి తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్ ముస్కాన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇక అభయ్, యాదమరాజు, పవన్, సత్యదేవ్, మనోజ్ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్, యాదమరాజు తన పెర్ఫార్మెన్స్తో హీరోకు పోటీగా నిలవడం విశేషం.
టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రఫి బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. ఇక యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలు సీన్లకు తగినట్టుగా ఉన్నాయి. లిరిక్స్ హృదయాలను కదిలించేలా ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగున్నా… సెకండాఫ్‌పై బెటర్‌గా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఆ కాలానికి తగ్గటు దుస్తులు, సెట్టింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్‌లు (+ ) :
సందీప్, అభయ్ నటన, తల్లి కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, మెయిన్ లైన్, సినిమాటోగ్రఫీ, హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్
మైనస్‌లు (-) :
కమర్షియల్ చట్రంలో ఇరికించడం, సెకండాఫ్, మాటలు, స్లో నెరేషన్, కొన్ని సీన్లు డాక్యుమెంటరీ తలపించడం
ఫైనల్‌గా…
జార్జ్‌రెడ్డి జీవిత చరిత్ర ఈ తరానికి చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. జార్జ్‌రెడ్డి గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం.
రేటింగ్ – 3 / 5