గణేష్ నిమజ్జనంపై తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. తీర్పును పునపరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరిన జీహెచ్ఎంసీ.. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరిన జీహెచ్ఎంసీ.. సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని విన్నవించింది.
హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరింది. ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని.. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని తెలిపింది జీహెచ్ఎంసీ. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని.. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని పేర్కొంది.
పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని వెల్లడించింది. నిమజ్జనం తర్వత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని.. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని పేర్కొంది జీహెచ్ఎంసీ. విగ్రహాలు ఆపితే వాహనాలు రోడ్లపై నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందన్నారు. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని పేర్కొంది.