జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం జరగనున్న వేళ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడానికి బల్దియా కాంట్రాక్టర్లు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాంట్రాక్టర్లు కార్యాలయం ముట్టడించకుండా అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ వద్ద ఆందోళనకు అనుమతి నిరాకరించారు.
మొదట లిబర్టీ అంబేడ్కర్ వద్ద ధర్నాకు దిగిన బల్దియా కాంట్రాక్టర్లు తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళనకు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు పలికారు. కొంతమంది నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొత్తకొత్త నిబంధనలతో జీహెచ్ఎంసీ తమను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంట్రాక్టర్లు వాపోయారు. పెండింగ్‌లో ఉన్న 800కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు కాసేపట్లో జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా.. రకరకాల కారణాలతో వాయిదా పడి ఐదు నెలల తర్వాత బల్దియా జనరల్ బాడీ మీటింగ్ జరగబోతోంది. ప్రస్తుత పాలకమండలి నిర్వహించబోతున్న నాలుగో జనరల్ బాడీ మీటింగ్ కోసం అధికార తెరాస, ప్రతిపక్ష కార్పొరేటర్లు తమ గళం వినిపిచేందుకు సిద్ధమయ్యారు