జీహెచ్ఎంసీ ఎన్నికల సమరంలో ప్రచారం హోరాహోరీగా జరిగింది. యుద్ధాన్ని తలపించేలా పార్టీలు తలపడ్డాయి. మరి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోనున్నారు. అసలు మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించాలో చూద్దాం… గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లలో కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు. మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. అంటే కార్పొరేటర్లు, గ్రేటర్ ఓటు హక్కు కలిగిన ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి మేయర్‌ను ఎన్నుకుంటారు.
150 కార్పొరేటర్ల పాటు నగరంలోని ప్రజాప్రతినిధులు గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలతో కలిసి మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో మేయర్ ఎన్నికకు మొత్తం ఓట్ల సంఖ్య 202గా లెక్కతేలింది. అంటే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే… 102 ఓట్ల బలం అవసరమవుతుంది. మేయర్ ఎన్నికలో గ్రేటర్‌లో హైదరాబాద్ పరిధిలోని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఓటుహక్కు కలిగి ఉంటారు.
పార్టీలపరంగా బలాబలాలు పరిశీలిస్తే.. ముందుగా టీఆర్‌ఎస్ పార్టీనే తీసుకుంటే… ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ చొప్పున టీఆర్‌ఎస్ గెలవాల్సిన డివిజన్లు 65 గా ఉన్నాయి. ఇక బీజేపీ,ఎంఐఎం,కాంగ్రెస్ గెలవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే.
జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగల మరికొందరు ప్రజా ప్రతినిదులు ఓటర్లు అవుతారు. వారిలో రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 24 మంది శాసనసభ్యులు, శాసనమండలిలో గవర్నర్ ద్వారా నామినేట్ అయిన, శాసనసభ్యుల కోటా నుంచి గెలుపొందిన శాసనమండలి సభ్యుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు కలిగిన వారు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా శాసనమండలి సభ్యులు ఉంటారు.