ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ గిరిరాజ్ విమర్శలు గుప్పించారు. ఎర్రకోటను నిర్మించింది తమ పూర్వికులేనన్న ఓవైసీ వ్యాఖ్యలను ఉద్దేశించి ‘వాళ్లు మీ పూర్వీకులు కాదు, దోపిడీ దొంగలు’ అని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గిరిరాజ్ సింగ్.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే హిందువులకు గుణపాఠం చెబుతాం అన్నాడని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించింది తమ పూర్వీకులేనని చెప్పాడన్న కేంద్రమంత్రి.. వాళ్లు ఆయన పూర్వీకులు కాదు దోపిడీ దొంగలని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, వారికంటే పెద్దదొంగలైన ఆంగ్లేయులు భారతదేశం మీదపడగానే ఎర్రకోటను నిర్మించిన దోపిడీ దొంగలు పారిపోయారని గిరిరాజ్‌సింగ్ విమర్శించారు. స్వదేశీ రాజుల పాలనలో సుభిక్షంగా ఉన్న దేశం విదేశీ ఆక్రమణలతో విధ్వంసమైందని, అభివృద్ధిలో వేల సంవత్సరాలు వెనుకబడి పోయిందని గిరిరాజ్ పేర్కొన్నారు.