రఘునందన్ రావుకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారా?

-

గతేడాది తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక పోరుని ఎవరూ మర్చిపోరనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ ఈ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దుబ్బాక టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఇక సోలిపేట చనిపోవడంతో సానుభూతితో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అలాగే టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో దుబ్బాకలో గెలుపుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ తరుపున రఘునందన్ రావు Raghunandan Rao నిలబడి రాజకీయాన్ని హీటెక్కించారు. గతంలో రఘునందన్ టీఆర్ఎస్‌లోనే పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. అలాంటి నేత అనూహ్య పరిణామాల మధ్య టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరారు.

రఘునందన్ రావు/ Raghunandan Rao

ఇక 2018 ఎన్నికల్లో బీజేపీ తరుపున నిలబడి 22 వేలు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలైంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అయింది. అటు ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకిత సైతం బీజేపీకి కలిసొచ్చింది. ఈ క్రమంలోనే దుబ్బాక ఉపఎన్నికలో ఆసక్తికర ఫలితం వచ్చింది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట భార్య సుజాత బరిలో నిలబడగా, బీజేపీ నుంచి రఘునందన్, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు.

అనూహ్యంగా రఘునందన్ దాదాపు వెయ్యి ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి రఘునందన్ దూకుడుగా ఉంటున్నారు. టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో పార్టీ గళం గట్టిగా వినిపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కడకక్కడ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా కూడా దుబ్బాకలో పలు సమస్యలని పరిష్కరించాలని కేసీఆర్‌ని కోరారు.

రాజకీయంగా విభేదాలు ఉన్నా సరే టీఆర్ఎస్ మంత్రులని సైతం కలిసి పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. ఇలా దుబ్బాకలో మరింతగా రఘునందన్ బలపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దుబ్బాకలో రఘునందన్ బలంగా ఉన్నారు. అటు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సుజాత పెద్దగా పార్టీలో కనిపించడం లేదు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ అడ్రెస్ లేదు. ఇక ఈ పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో సైతం ప్రత్యర్ధులు, రఘునందన్‌కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version