తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగుగు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. దీనికి తోడు భద్రాచలంలో గోదావరికి వరద పోటెత్తింది.రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు 31.5 అడుగులు ఉన్న గోదావరి, మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అంతేకాకుండా తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు స్తంభించాయి.అటుగా వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలువరిస్తున్నారు.