తెలంగాణలో టెక్స్‌టైల్ రంగం మరింత పుంజుకుంటుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ ముందుకు వచ్చింది. దేశంలో ప్రముఖ రెడీమేడ్ వస్త్రాల తయారీ పరిశ్రమగా అయిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా శుక్రవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్ లో కలిసి తమ పెట్టుబడి కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా గోకల్ దాస్ కంపెనీ ఒక అవగాహన ఒప్పందాన్నికూడా కుదుర్చుకుంది.
గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్ టైల్ రంగాన్ని తన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా ఉంచి అనేక కార్యక్రమాలను చేపడుతోందని, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాట్లు చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలో సుమారు 65 ఎకరాల్లో పొద్దూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటికే ఈ పార్కుకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు స్థూలంగా టెక్స్‌టైల్ మరియు అప్పారాల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇందులో మహిళలకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ఆ కంపెనీ ఎండీ సుమిర్ హిందూజా తెలిపారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా ప్రధానంగా వస్త్రాల తయారీ ఉందని ఈరోజు ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా రెడీ టు వేర్/ రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ఈ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మరిన్ని అప్పారెల్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. గోకల్ దాస్ కంపెనీని సిరిసిల్లకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్, కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.