విజయవాడ ఇంద్రాకీలాద్రి దుర్గ అమ్మవారి దీక్షల సందర్భంగా ప్రత్యేకమైన యాప్ ని లాంచ్ చేసినట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం చెప్పామన్నారు. అయితే ఈ నెల 21వ తేదీ నుంచి భవానీ భక్తులు మాల విరమణ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారని పేర్కొన్నారు.
ఏటా సుమారు 5 లక్షల పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కనకదుర్గ నగర్ లో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేసి, ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అయితే.. ఈరోజు ఒక యాప్‌ని లాంచ్ చేసాము. ఆ యాప్ ద్వారా భవానీలు ఎంత మంది వచ్చారు. రోజుకి ఎంతమంది వస్తున్నారని ఈ యాప్ ద్వారా తెలుస్తుంది అన్నారు. భవానీలు ముందుగానే ఈ యాప్ లో వారు ఎప్పుడు వస్తారో సమయాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ ని సద్వినియోగం చేసుకోవలసిందిగా భక్తులకు సూచించారు.