కిడ్నీ రోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌: ఇక ఇంట్లోనే డ‌యాల‌సిస్‌

-

డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ రోగులు నరకం అనుభవిస్తుంటారు. ఆ స్టేజ్‌కు వెళ్లారంటే ఇక వాళ్లు ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌తి వారంలో రెండు, మూడు రోజులు ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌డం… అక్క‌డ నాలుగైదు గంట‌ల పాటు డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం కామ‌న్‌. ఇక‌పై ఈ ప‌ద్ద‌తికి కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. వీళ్ల ఇబ్బందులు తీర్చేందుకు కొత్త ప‌ద్ధ‌తి అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చింది.  ‘పెరిటోనియల్‌ డయాలసిస్‌’అనే ఈ పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చు. కేంద్రం ఇందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది.

ఈ పెరిటోనియ‌ల్ ప‌ద్ధ‌తి ఇప్ప‌టికే అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పాటిస్తున్నారు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో ఆస్ప‌త్రుల‌కు వెళ్లి డ‌యాల‌సిస్ చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా డ‌యాల‌సిస్ ఇంట్లోనే చేయించుకోవ‌చ్చు. ఇక మ‌న‌దేశంలో రోజు రోజుకు కిడ్నీ రోగులు ఎక్కువ అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనాల ప్ర‌కారం 2015లో ఏకంగా 1.36 లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా కోటికి చేరింది.

భార‌త్‌లో కిడ్నీ రోగుల సంఖ్య పెరిగేందుకు షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే ప్ర‌ధాన కార‌ణం.
తెలంగాణలో ప్రస్తుతం 3 లక్షల మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 15 వేల మందికి డయాలసిస్‌ జరుగుతోంది. ప్రైవేటుగా డ‌యాల‌సిస్ చేయించుకోవాలంటే ఇళ్లు, ఒళ్లు అంతా గుల్ల‌వుతోంది. ప్రైవేటుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేసినందుకు ఒక్కోసారి రూ.3 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు.

పెరిటోనియల్ ప‌ద్ధ‌తిలో లాభాలివే…
పెరిటోనియ‌ల్ ప‌ద్ధ‌తిలో డ‌యాల‌సిస్ బ్యాగుల ద్వారా డ‌యాల‌సిస్ చేసుకోవ‌చ్చు. రోజుకు అర గంటపాటు … అవసరాన్ని బట్టి రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు. పెరిటోనియల్‌ డయాలసిస్‌కు ఇంట్లో వెలుతురు ఉన్న గదితో పాటు దానికి అనుబంధంగా బాత్ రూం ఉంటే చాలు. హీమో డయాలసిస్‌ ద్వారా నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే.. పెరిటోనియల్‌ ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక రోగులు రెండు నెల‌ల‌కు ఓసారి స్థానిక ఏరియా లేదా పీహెచ్‌సీల‌కు వెళ్లి త‌మ ప‌రిస్థితి వివ‌రిస్తే స‌రిపోతుంది. అలాగే, రెండు మూడు నెల‌ల‌కు ఓ సారి కిడ్నీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version