సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఉభయ పక్షాలూ ఆమోదించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారని వివరించారు చిరంజీవి. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తాను వివరించానని.. వాటి పై సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం జగన్ అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చారని… మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అన్ని సానుకూలంగా ఆలకించారని.. సినీ ఇండస్ట్రీ విషయంలో జగన్ స్పందన సంతృప్తినిచ్చిందన్నారు. పైకి కన్పించినంత గ్లామరుగా సినీ ఫీల్డ్ ఉండదు… రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారని వెల్లడించారు. థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయని.. హాళ్లని మూసేస్తేనే బెటరే భావనకు కొందరు థియేటర్ యజమానులు ఉన్నారన్నారు చిరు.
అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని.. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునః పరిశీలిస్తామన్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని.. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారని చెప్పారు.