భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే… పంట నష్టం పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. 13 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు మంత్రి కన్నబాబు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించాలని… నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు కన్నబాబు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తుఫాన్ ప్రభావం ఎక్కువగా వున్న జిల్లాల్లో సీనియర్ వ్యవసాయ శాఖా అధికారులు పర్యటించాలని ఆదేశించారు. ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాల్లో పంట నష్ట అంచనాలు , రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. ఈస్ట్ గోదావరికి హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, వెస్ట్ గోదావరికి జెడి శ్రీధర్ , కడప జిల్లాకు సీడ్స్ ఎండి శేఖర్ బాబులకు బాధ్యతలు అప్పగించామన్నారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న పంటని అంచనా వెయ్యడంతో పాటు మిగిలిన పంటను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని.. వ్యవసాయ సలహా మండళ్లు తమ పరిధిలో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులకు అండగా ఉండాలన్నారు. కడప జిల్లాలో నష్టపోయిన బెంగలగ్రామ్ రైతుల్ని గుర్తించి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని.. ఈ క్రాప్ ద్వారా దెబ్బతిన్న రైతులు గుర్తించి సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.