మార్గశిరంలో రాబోయే పర్వదినాలు ఇవే!

-

మార్గశిర బహుళ పాడ్యమి- మార్గశిర కృష్ణ (బహుళ) పాడ్యమి.. నవ మహోత్సవ దినమని నీలమత పురాణంలో ఉంది. దీనిని బట్టి కాశ్మీరులో ఒకప్పుడు ఇది కొత్త సంవత్సర ప్రారంభ దినం. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతి, శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలోనూ రాశారు.

మార్గశిర బహుళ సప్తమి… ఈ తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది. అయితే, వీటిని ఎలా ఆచరించాలనే వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు.

మార్గశిర బహుళ అష్టమి… మార్గశిర కృష్ణ అష్టమి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని ఉంది. కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

మార్గశిర బహుళ నవమి… మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

మార్గశిర బహుళ ఏకాదశి… మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశిగానూ ప్రతీతి. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. దీనికే సఫలైకాదశి అని కూడా పేరు. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.

మార్గశిర బహుళ ద్వాదశి… చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో- ఈనాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని చెబుతోంది.

మార్గశిర బహుళ త్రయోదశి… మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.మార్గశిర బహుళ అమావాస్య… ఈ తిథికే మహోదధ్యమావాస్య అనీ పేరు. బకులామావాస్య అనీ అంటారు. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి నివేదన చేసే దినం ఇదని. ఈసారి మార్గశిర అమావాస్యనాడు సూర్యగ్రహణం కూడా వస్తుండటం విశేషం.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version