మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర పోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా సరే నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం నిర్దేశించిన గంటల సమయం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు నిత్యం 9 గంటలకు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
చైనాలోని వుహాన్‌లో ఉన్న హువాజ్‌హాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు 6 ఏళ్ల పాటు 31,750 మందిని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికున్న ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానం, నిద్రించే సమయం, వారికున్న వ్యాధులు తదితర అనేక అంశాలను సేకరించి చివరకు ఆ సమాచారం మొత్తాన్ని విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే… నిత్యం 9 గంటల కన్నా ఎక్కువగా నిద్రించే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 23 శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
అలాగే నిత్యం పగటి పూట 90 నిమిషాల కన్నా ఎక్కువ సేపు నిద్రించే వారికి ఆ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 25 శాతం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. కనుక నిత్యం తగినన్ని గంటలపాటు మాత్రమే నిద్రించాలని వారు సూచిస్తున్నారు. ఇక ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.