ఆన్‌లైన్‌లో హింసను ప్రేరేపించే, తప్పుడు వార్తల్ని అడ్డుకునేందుకు గూగుల్ కంపెనీ భారత్‌లో భారీ ప్రాజెక్ట్ చేపడుతోంది. ఈమేరకు యాంటీ మిస్-ఇన్ఫర్మేషన్ పేరుతో గూగుల్ జిగ్సా సబ్సిడియరీ ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. అందుకోసం యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోని తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను పోస్ట్ చేసి, వాటి మీద యూజర్లకు అభిప్రాయం తెలుసుకోనుంది గూగుల్. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల ద్వారా యూజర్లు ఫేక్ న్యూస్‌ను కనిపెడుతున్నారా? లేదా? అనేది కూడా గమనించనుంది గూగుల్. జర్మనీలోని అల్‌ఫ్రెడ్ ల్యాండ్ డెకర్ ఫౌండేషన్, ఒమిడ్య నెట్‌వర్క్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలతో కలిసి ప్రయోగాత్మకంగా ఐదు ఫేక్ న్యూస్ వీడియోలను గూగుల్ పోస్ట్ చేసింది. వాటి గురించి యూజర్లను మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడిగింది. 5 శాతం మంది యూజర్లు తప్పుడు వార్తలతో ఉన్న వీడియోలను పసిగట్టారు. భారత్‌లో తప్పుడు వార్తల్ని అడ్డుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఎందుకంటే.. బెంగాలీ, హిందీ, తెలుగు, మరాఠీ.. ఇలా ప్రాంతీయ భాషల్లో పోస్ట్ చేసిన తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలి. ఇతర దేశాలతో పోల్చితే సోషల్‌మీడియా ద్వారా భారతదేశంలోతప్పుడు వార్తల ప్రచారం వేగవంతంగా జరుగుతుంది. అవి రాజకీయ, మతపరమైన అలజడులకు కారణం అవుతున్నాయి. దాంతో, ఆన్‌లైన్‌లో తప్పుడు వార్తలను నిలువరించాలని మెటా, గూగుల్, ట్విట్టర్ వంటి కంపెనీలను భారత ప్రభుత్వం కోరింది. గూగుల్ ఈమధ్యే యూరప్‌లో ఒక ప్రయోగం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తున్న సమయంలో శరణార్థులకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ఉన్న పోస్టులకు కౌంటర్‌గా ఈ ప్రయోగం చేసింది గూగుల్.