ఏపీ గవర్నర్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చిందని అవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక ఉగ్రవాది పాలన లో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోందని మండిపడ్డారు. అప్పుల మయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుందని హెచ్చరించారు. ఆఖరికి ఏపీ గవర్నరును కూడా వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థానికి బలి చేసిందని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్లకు బకాయిలు, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముందన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా అని.. వారికేదో ధర్మం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, వేలకోట్లను వ్యసనపరుల నుంచి కొల్లగొట్టిందని అగ్రహించారు. పెట్రోల్ డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం వాటిపై ప్రజల నుంచి వేలకోట్లు దండుకుంటోందన్నారు. రూ. 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సకాలంలో ప్రభుత్వం ఎందుకు జీతాలివ్వడంలేదు ? అని అగ్రహించారు.