మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ” దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలు అందించారు.
దాంతోపాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ తో ఉంది. వారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారు అందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టిఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో ఆయన మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు.
వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారు అందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు” అని తెలిపారు కేసీఆర్.