కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్న నూతన విద్యావిధానానికి గత వారంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. అయితే అందులో భాగంగా మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. అయితే దానికి తోడు ఇకపై ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా అందివ్వనున్నారు. ఈ మేరకు నూతన విద్యావిధానంలో మార్పులు చేశారు. దీంతో త్వరలోనే విద్యార్థులు ఉదయం పూట రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ తిననున్నారు.
ఉదయం పూట విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన శక్తివంతమైన ఆహారాన్ని ఇస్తే వారు చదువుల్లో రాణిస్తారని సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. అందువల్లే విద్యార్థులకు అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా ఉదయం పూట విద్యార్థులకు పల్లీలు లేదా శనగలను బెల్లంతో కలిపి ఇవ్వనున్నారు. లేదా సీజనల్ పండ్లను ఇస్తారు. దీంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా కొనసాగుతుంది. దీని వల్ల దేశంలోని 11.59 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. అలాగే 26 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
కాగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో భాగంగా పాలు, గుడ్లు, పండ్లను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిధులతో అందజేస్తున్నాయి. అయితే వాటికి తోడు అదనంగా ఉదయం పూట ఇకపై విద్యార్థులు రుచికరమైన, పోషకాలతో కూడిన శక్తివంతమైన బ్రేక్‌ఫాస్ట్‌ను పొందుతారు. ఇక నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లలో ఎప్పటికప్పుడు విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా చేస్తారు. దేశంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లు, స్పెషల్ ట్రెయినింగ్ సెంటర్లు, సమగ్ర శిక్షలో భాగంగా ఉన్న మదర్సాలలో విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కూడా పెడతారు.