ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో ఎస్ఎల్‌బీసీ పర్యవేక్షణను గాలికొదిలేశారని ఆరోపించారు.
నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడటం వల్లే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుంటే వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఓ బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ లీడర్లు.. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.