కేసీఆర్ ‘ లెక్క ‘ తప్పుతోందా ? ఇవన్నీ టెన్షన్ పెట్టేవే ?

-

గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలను టెన్షన్ పెడుతున్నట్లుగానే, అధికార పార్టీ టిఆర్ఎస్ ను మరింతగా కంగారు పెడుతున్నాయి. 2018 లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన సమయంలోనూ, కేసీఆర్ ఇప్పుడు పడినంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. సాఫీగానే ఎన్నికలకు వెళ్లి అనుకున్న మేర విజయం సాధించారు. అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ తో ప్రధాన పోటీ ఉంటుందని ముందుగా అంచనా వేసినా, బిజెపి బలం పెంచుకోవడం టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వం పై జనాల్లో ఆగ్రహం పెరిగినట్లుగా వివిధ సర్వేల్లోనూ తేలడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల్లో గట్టెక్కకపోతే , రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అనే భయం టిఆర్ఎస్ పార్టీలో నెలకొంది. అసలు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా ఇంతగా భయపడడానికి కారణం అనేక అంశాలు ఉన్నాయి.

కరోనా సమయంలో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం తమను సరిగా పట్టించుకోలేదనే అభిప్రాయం పేద, మధ్యతరగతి వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. కరోనా కట్టడికి, కరోనా నిర్ధారణ పరీక్షలు, ట్రీట్మెంట్ వంటి విషయాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.కేసీఆర్ సైతం చాలాకాలం ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోవడం ఆయన ఎక్కడ ఉన్నారు అనే సమాచారం ఎవరికి తెలియక పోవడం, కీలకమైన సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వ్యవహరించలేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక ఆ ఇబ్బందులను అధిగమిస్తున్నాము అని ఎప్పటికప్పుడు అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గ్రేటర్ ను ముంచెత్తిన వరదల కారణంగా ప్రభుత్వం పరువు ప్రతిష్ట మొత్తం మంట గలిపాయి.

వరదల కారణంగా వారం రోజుల పాటు ప్రజలు నరకయాతన అనుభవించినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని, వరద సహాయం కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోయారు అని ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం వచ్చినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఈ సందర్భంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటే వెళ్తే.. ఎన్నో అంశాలు టిఆర్ఎస్ కు ఇప్పుడు టెన్షన్ కలిగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version