బ్యాంకు లాక‌ర్ల‌లో ఉన్న వ‌స్తువులు పోతే ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి ?

-

బ్యాంకు లాక‌ర్ల‌లో స‌హ‌జంగానే మ‌నం విలువైన వ‌స్తువుల‌ను, ఇత‌ర ముఖ్య‌మైన ప‌త్రాల‌ను దాచుకుంటుంటాం. ఇంట్లో సేఫ్టీ లేద‌ని భావించినా, ముఖ్య‌మైన ప‌త్రాలు ఇంట్లో ఉండ‌వ‌ద్ద‌ని అనుకున్నా.. మ‌నం వాటిని బ్యాంకు లాక‌ర్ల‌లో దాస్తాం. అయితే బ్యాంకు లాక‌ర్ అనేది వాల్యూ యాడెడ్ స‌ర్వీస్ లాంటిది. ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయ‌గానే ఆటోమేటిగ్గా ల‌భించే డెబిట్ కార్డు, చెక్ బుక్ లాంటిది కాదు. బ్యాంకు లాక‌ర్ల‌కు ప్ర‌త్యేక చార్జి చెల్లించాలి. దాని సైజును బ‌ట్టి చార్జిలు ఉంటాయి. అయితే బ్యాంకు లాక‌ర్ల‌లో మ‌నం దాచే మ‌న వ‌స్తువులు, ప‌త్రాలు పోతే.. అందుకు ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి ? మ‌న‌కు క‌లిగిన న‌ష్టాన్ని బ్యాంకు భ‌రిస్తుందా ? అంటే..

కాదు.. బ్యాంకు లాక‌ర్ల‌లో మ‌నం స్టోర్ చేసే వ‌స్తువులు, ప‌త్రాలు ఏవైనా స‌రే.. పోతే అందుకు మ‌న‌మే బాధ్య‌త వ‌హించాలి త‌ప్ప బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వు. అలా అని చెప్పి మ‌నం బ్యాంకు లాక‌ర్ల‌ను తీసుకునే స‌మ‌యంలోనే వారు ఒప్పంద ప‌త్రంపై మ‌న సంత‌కం తీసుకుంటారు. అగ్ని ప్ర‌మాదాలు, వ‌ర‌ద‌లు, ఇత‌ర ప్ర‌కృతి విప‌త్తులు, యుద్ధం త‌దిత‌ర సంఘ‌ట‌న‌లు ఏవి జ‌రిగినా స‌రే.. లాక‌ర్ల‌లో దాచిన వాటికి మ‌న‌మే బాధ్యులం అవుతాం, బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వు.

కానీ లాక‌ర్ల‌ను నిర్వ‌హించ‌డంలో బ్యాంకులు నిర్ల‌క్ష్యం వ‌హించినా, బ్యాంకుల సిబ్బంది నిర్ల‌క్ష్యం వల్ల లాక‌ర్ల‌లోని మ‌న వ‌స్తువులు, ప‌త్రాలు పోయినా.. అలాంటి సంద‌ర్బాల్లో బ్యాంకులు బాధ్య‌త వ‌హిస్తాయి. ఇదే విష‌యమై గ‌తంలో పలువురు వినియోగ‌దారులు క‌న్‌జ్యూమ‌ర్ ఫోరంల‌లో కేసులు వేసి విజ‌యాలు సాధించారు కూడా. క‌నుక బ్యాంకు నిర్ల‌క్ష్యం కార‌ణంగా లాక‌ర్ల‌లో ఉండే వ‌స్తువులు, ప‌త్రాలు పోతే బ్యాంకులు బాధ్య‌త వ‌హిస్తాయి. కానీ ఇత‌ర ఏ సంద‌ర్భంలో అయినా స‌రే వారు బాధ్య‌త వ‌హించ‌రు. అందుకు మ‌న‌మే బాధ్యులం అవుతాము.

అయితే లాక‌ర్ల‌లో వ‌స్తువుల‌ను దాచే స‌మ‌యంలో వాటి విలువను బట్టి ఇన్సూరెన్స్ తీసుకోమ్మ‌ని బ్యాంకులు సూచిస్తుంటాయి. క‌నుక ఆ ప‌ని చేస్తే మంచిది. దీంతో లాక‌ర్ల‌లో దాచే మ‌న వ‌స్తువుల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. అవి పోయినా, నాశ‌న‌మైనా ఇన్సూరెన్స్ క‌వ‌ర్ అవుతుంది. ఇలా న‌ష్టం రాకుండా చూసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version