గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, గోదావరి సాగర సంగమం.. ఇలా ఒకటా, రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. అయితే ఈ దృశ్యాన్ని చూసి ఎక్కడో కోనసీమ ప్రాంతం అనుకుంటే పొరపాటే. ఇది అచ్చంగా రాయలవారు ఏలిన రాయలసీమ ప్రాంతం. కరువుకు నిలయమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు పచ్చదనం పరుచుకుంది. రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి.
ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు నీరు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీంతో పదేళ్లుగా నీరు లేక ఎండిపోయిన నదుల్లో జలసిరి ప్రవహిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం కూడా కడప జిల్లాలోనిది. పెన్నా పరీ వాహక ప్రాంతం సిద్దవటంలో వరద నీరు, వర్షాలతో పచ్చదనంలా తయారైంది. దీంతో చామంతిపూలు, పసుపు పంటలు సాగుచేశారు రైతులు. కమలాపురం, బద్వేల్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వరిపంటను సాగుచేశారు.