మనం పీల్చేది కలుషిత వాయువేనట.. గ్రీన్‌పీస్‌ ఇండియా నివేదిక

-

రానురాను పర్యావరణం కలుషితమైపోతోంది. గాలి, నీరు, ఆహారం కాదేది కలుషితానికి అనర్హం అన్నట్లు అన్నీ కలుషితమై పోతున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఏ కొండలు, అడవులు ఉన్న ప్రదేశానికి వెళ్లాల్సిందే. ఈ కాంక్రీట్ జంగల్స్ లో అందరూ పీలుస్తోందని విష వాయువే. 99 శాతం భారతీయులు పీలుస్తోంది కలుషిత వాయువేనని ఓ అధ్యయనం వెల్లడించింది.

డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం2.5 ఆధారిత వార్షిక ఆరోగ్య మార్గదర్శకాలను మించి అయిదు రెట్లు ఉందని పేర్కొంది. ఈ మేరకు గ్రీన్‌పీస్‌ ఇండియా రూపొందించిన ‘డిఫెరెంట్‌ ఎయిర్‌ అండర్‌ వన్‌ స్కై’ పేరిట శుక్రవారం విడుదల చేసిన నివేదిక వివరించింది. అంతేకాకుండా దేశంలోని 62 శాతం మంది గర్భిణిలు అత్యంత కాలుష్య పూరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది.

నివేదిక వార్షిక సగటు పీఎం2.5 కాలుష్య ఎక్స్‌పోజర్‌ విశ్లేషణ మేరకు దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యేది దిల్లీ ప్రాంతమని పేర్కొంది. నాణ్యత లేని గాలి పీల్చడం వల్ల వృద్ధులు, శిశువులు, గర్భవతులు ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతారని వివరించింది. అతి సూక్ష్మ ధూళికణ కాలుష్యాన్ని పీఎం2.5గా వ్యవహరిస్తారు. ఇది శరీరం లోపలికంటా చొచ్చుకుపోతుంది. ఈ కారణంగా ఊపిరితిత్తులు, శ్వాసనాళంలో వాపు వస్తుంది. అది గుండెజబ్బులకు, శ్వాసకోశ సమస్యలు, రోగనిరోధకశక్తి సన్నగిల్లడానికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి నివేదిక సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version