అఫ్గానిస్థాన్ లో ఘోరం చోటు చేసుకుంది. హెరాత్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్లు సమాచారం. క్షతగాత్రులను హెరాత్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
గత రెండు దశాబ్దాలుగా మజీబ్ ఉల్ రెహమాన్ అన్సారీ అనే మత గురువు అఫ్గానిస్థాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అతన్ని చంపడానికే ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మత గురువు అన్సారీ మరణించినట్లు తాలిబన్ అధికారి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్ దేశంలో షియా ముస్లింలను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.