గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. వారి సమస్యలను ఎవరూ పట్టించుకోకపోవడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బంగారం లాంటి భవిష్యత్‌ను తమ చేతులతో విద్యార్థులు ముగించేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో గురుకుల విద్యార్థుల వరుస ఆత్మహత్యలను మరువక ముందే తాజాగా ఏపీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌యమ్ పురం గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు ముద్దాడ దిలీప్‌గా గుర్తించారు. అతనిది జిల్లాలోని జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామం. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కాగా, విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.